కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా?

  • కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం
  • సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీక‌ర‌ణ‌
  • కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
  • కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్న తరహాలోనే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. సీఎం పదవి కోసం ఆశావహులు పట్టువీడకపోవడంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ మరింత ముదిరింది. సీఎం పదవి ఆశిస్తున్న కీలక నేత వీడీ సతీశన్, ఆ పదవి తప్ప మరే ఇతర పదవినీ స్వీకరించేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేయడంతో అధిష్ఠానం ఇరకాటంలో పడింది.

వేణుగోపాల్‌కే అధిష్ఠానం మొగ్గు.. ప్రజాబలం ఉందంటున్న సతీశన్
కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాత్రం రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తోంది. శాసనసభ్యుల్లో కూడా ఎక్కువ మంది ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం సతీశన్‌కు కేబినెట్‌లో కీలక మంత్రి పదవి, మరో ఆశావాహుడు రమేశ్ చెన్నితాలకు స్పీకర్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రజల్లో మంచి ఆదరణ, మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) మద్దతు ఉన్న సతీశన్, రెండో స్థానానికి అంగీకరించడం లేదు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయాల్లో వేణుగోపాల్ కటౌట్లు, పోస్టర్లు వెలుస్తుండగా, సతీశన్ వర్గీయులు నిరసనలతో తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఒత్తిడి తంత్రాలపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

హైకమాండ్‌కు తలనొప్పి 
ఈ చిక్కుముడిని విప్పేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రేపు కేరళ కాంగ్రెస్ మాజీ, ప్రస్తుత అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఒకవేళ వేణుగోపాల్‌ను సీఎంగా నియమిస్తే, ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నందున అసెంబ్లీకి పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆయన లోక్‌సభ స్థానానికి కూడా ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ఇది పార్టీకి అదనపు భారంగా మారుతుంది.

కేరళ అసెంబ్లీ పదవీకాలం మే 23 వరకు ఉన్నందున, ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉందని, తొందరపడాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కర్ణాటక అనుభవంతో పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్, కేరళ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందోనన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

VD Satheesan
KC Venugopal
Kerala Congress
Kerala CM
Ramesh Chennithala
Indian Union Muslim League
Kerala Politics
Congress High Command
Rahul Gandhi
Karnataka Politics

More Telugu News